

దీపావళి పండుగ సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్‌లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. స్వీట్లు, చిరుతిళ్లు, పూలు, మట్టి దీపాల నుంచి గిఫ్ట్ హ్యాంపర్లు, బంగారం, వెండి నాణేల వరకు ప్రజలు అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు. గతంలో పండుగ షాపింగ్ కోసం దుకాణాలకు వెళ్లి గంటల తరబడి సమయం గడిపేవారు. ఇప్పుడు మొబైల్ యాప్‌ల ద్వారా నచ్చిన వస్తువులను నిమిషాల్లో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఈ మార్పు ఈ ఏడాది దీపావళి కొనుగోళ్ల గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.
జెప్టోలో గత ఏడాదితో పోలిస్తే గిఫ్ట్ హ్యాంపర్ల ఆర్డర్లు మూడు రెట్లు పెరిగాయి. సుమారు 4.68 లక్షల మట్టి దీపాలను కస్టమర్లు ఆర్డర్ చేయగా, పూలు, పూలదండల కొనుగోళ్లు రెండున్నర రెట్లు పెరిగాయి. ఆర్డర్ల సంఖ్య పరంగా లడ్డూలకు ఎక్కువ ప్రాధాన్యత లభించగా, మొత్తం అమ్మకాల పరంగా సోన్ పప్డీ ముందంజలో నిలిచింది. సంప్రదాయ దుస్తులు, వాటికి సంబంధించిన యాక్సెసరీల కొనుగోళ్లు రెండింతలు పెరిగాయి. దీపావళి రోజున బ్యూటీ ఉత్పత్తులకు కూడా అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో దీపావళి పార్టీలు, వేడుకలకు అవసరమైన వస్తువుల ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 162 శాతం పెరగగా, స్నాక్స్ కొనుగోళ్లు 42 శాతం పెరిగాయి. స్వీట్లలో కాజు కట్లీకి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత మోతీచూర్ లడ్డూ, బేసన్ లడ్డూలు నిలిచాయి. నవంబర్ 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. ఉదయం 11:18 గంటలకు ఒక్క నిమిషంలోనే అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. దీపావళికి ముందు రోజు డైట్ కోక్ అత్యధికంగా ఆర్డర్ చేసిన నాన్-గ్రోసరీ వస్తువుగా నిలిచింది. దుస్తులు, నగలు, హెయిర్ యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వస్తువుల కొనుగోళ్లు కూడా పెరిగాయి.
ధన్‌తేరస్ సందర్భంగా బంగారు, వెండి నాణేలకు కూడా భారీ డిమాండ్ కనిపించింది. నవంబర్ 6న అర్ధరాత్రి 12 గంటల 30 సెకన్లకు హైదరాబాద్ నుంచి ఇన్‌స్టామార్ట్‌లో తొలి బంగారు నాణెం ఆర్డర్ నమోదైంది. పూల డిజైన్‌తో ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణెాన్ని కస్టమర్ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత కేవలం నాలుగు సెకన్లకే బెంగళూరు నుంచి వెండి నాణెం కోసం మరో ఆర్డర్ వచ్చింది. బంగారు నాణేలు కొనుగోలు చేసిన వారిలో దాదాపు మూడింట రెండొంతుల మంది పూల డిజైన్లను ఎంచుకోగా, వెండి నాణేలు కొనుగోలు చేసిన వారిలో 73 శాతం మంది లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలున్న నాణేలను ఎంపిక చేసుకున్నారు. సాయంత్రం 6:38 గంటలకు ఈ కొనుగోళ్లు అత్యధికంగా జరిగాయి. ముంబైలో ఒక కస్టమర్ రూ.1.11 లక్షల విలువైన బంగారు నాణేలను ఆర్డర్ చేయగా, హైదరాబాద్‌లో మరో కస్టమర్ 2 గ్రాముల బంగారు నాణెం, 100 గ్రాముల వెండి బార్ కలిపి రూ.52,215 విలువైన ఆర్డర్ పెట్టారు. ఈ గణాంకాలు క్విక్ కామర్స్ యాప్‌లు నిత్యావసర వస్తువులకే కాకుండా పండుగ షాపింగ్‌కు కూడా ప్రధాన వేదికలుగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!