

దేశీయ విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో రూపాయిపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 12 నుంచి ప్రభుత్వ రంగానికి చెందిన మూడు ప్రధాన చమురు మార్కెటింగ్ సంస్థలు—ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం—రోజువారీ డాలర్ల అవసరాలను ఆర్బీఐ నేరుగా తీర్చనుంది. గత శుక్రవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.96.74కు పడిపోయి రికార్డు స్థాయి కనిష్టాన్ని నమోదు చేయడంతో ఈ చర్య చేపట్టింది.
భారత్ తన ముడిచమురు అవసరాల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడుతోంది. ఆగస్టు గణాంకాల ప్రకారం దేశం నెలకు సుమారు 2.3 కోట్ల టన్నుల ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. దీని విలువ దాదాపు 11.7 బిలియన్ డాలర్లు కాగా, రోజువారీ దిగుమతుల విలువ సుమారు 377 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థల వాటా దాదాపు 55 శాతం. సాధారణంగా చమురు దిగుమతుల చెల్లింపుల కోసం ఈ సంస్థలు స్పాట్ మార్కెట్‌లో డాలర్లను కొనుగోలు చేస్తాయి. ఆగస్టు గణాంకాల ఆధారంగా వీటికి రోజుకు సుమారు 200 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం అవసరం. రష్యా నుంచి కొనుగోలు చేసే చమురుకు యూఏఈ దిర్హామ్‌లు లేదా రూపాయల్లో చెల్లింపులు చేసినప్పటికీ, నేరుగా డాలర్లలో చెల్లించాల్సిన మొత్తం రోజుకు కనీసం 114 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఆర్బీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విండో ద్వారా ఈ మూడు సంస్థలు ఇకపై స్పాట్ మార్కెట్‌లో పోటీపడి డాలర్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రత్యేకంగా కేటాయించిన బ్యాంకుల ద్వారా ప్రస్తుత మార్కెట్ ధరలకే ఆర్బీఐ నేరుగా డాలర్లను విక్రయిస్తుంది. దీంతో బహిరంగ మార్కెట్‌లో రోజువారీ డాలర్లకు ఉండే డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో హెచ్చుతగ్గులు తగ్గి, రూపాయిపై ఒత్తిడి కొంత మేర తగ్గవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!