

రూపాయి మారకపు విలువలో క్షీణతను నియంత్రించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (ఓఎంసీలు) ముడి చమురు దిగుమతుల కోసం అవసరమైన డాలర్లను స్పాట్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ప్రత్యేక డాలర్ విండోను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 12 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. నిర్దేశిత బ్యాంకుల ద్వారా ఆర్‌బీఐ నేరుగా ఓఎంసీలకు డాలర్లను విక్రయించనుంది.
భారత్ మొత్తం దిగుమతుల్లో ముడి చమురు వాటా సుమారు 25 శాతం వరకు ఉండటంతో, చమురు దిగుమతుల కోసం భారీ మొత్తంలో డాలర్లు అవసరమవుతున్నాయి. ఈ డిమాండ్‌ను తీర్చేందుకు ఓఎంసీలు స్పాట్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున డాలర్లను కొనుగోలు చేయడం రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. ఫలితంగా రూపాయి మారకపు విలువలో క్షీణతతో పాటు తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించి, విదేశీ మారకపు మార్కెట్‌లో స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!