

అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోలుకోకముందే మరో వాతావరణ ముప్పు పొంచి ఉంది. అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న నికోబార్ దీవుల పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనంతరం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. సోమవారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. మరోవైపు, నగరంలో 91.5 మి.మీ., తణుకులో 81.2 మి.మీ., చోడవరంలో 80.2 మి.మీ., మచిలీపట్నంలో 76.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!