

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల ఉద్యమం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే "అమరావతి: ప్రజలచే నిర్మించబడింది... విధిచే రక్షించబడింది" పేరుతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఏపీ కూటమి ఎంపీల బృందం కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మోహన్‌లాల్ ఖట్టర్కు అందజేసింది. పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, రైతులు, మహిళలు సాగించిన 1,631 రోజుల ఉద్యమం, అలాగే 2024 జూన్ 2న అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునరుద్ధరించిన నిర్ణయం వంటి చారిత్రక అంశాలను ఈ పుస్తకం సమగ్రంగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడంలో కూటమి ఎంపీలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడకు సంబంధించిన పలు సమస్యలను కూడా కేంద్ర మంత్రి ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!