

భారీ వర్షాలతో థాయ్‌లాండ్‌లోని పలు ప్రాంతాలు తీవ్ర వరదలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రాజధాని బ్యాంకాక్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నగరంలో కేవలం మూడు రోజుల్లో సుమారు 320 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా సెప్టెంబర్ నెల మొత్తం నమోదయ్యే వర్షపాతానికి దాదాపు సమానమని అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వరద నీరు చేరడంతో సాధారణ జనజీవనం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్యాంకాక్‌లో సుమారు 7 లక్షల మంది వరదల ప్రభావానికి గురైనట్లు సమాచారం.
వరదల ప్రభావం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంపైనా పడింది. విమాన సర్వీసుల్లో ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల కారణంగా గ్రౌండ్ ఆపరేషన్స్, సిబ్బంది లభ్యత ప్రభావితమై థాయ్ ఎయిర్‌వేస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో భారీగా లగేజీ పేరుకుపోయింది. సెప్టెంబర్ 29 నాటికి థాయ్‌లాండ్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య 23కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో బ్యాంకాక్‌లో వరద నీరు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, పలు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచి ఉంది. సహాయక, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!