

2026–27 ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తలెత్తే ప్రజారోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్రేడ్-3 అత్యవసర స్పందనను ప్రారంభించింది. ఇది సంస్థలో అత్యున్నత స్థాయి అంతర్గత అత్యవసర స్పందన విధానం. 2026 అక్టోబరు నుంచి 2027 సెప్టెంబరు వరకు అమలయ్యే ఈ ప్రణాళికలో భాగంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వ్యాధుల పర్యవేక్షణ, వైద్య సేవల సంసిద్ధతపై దృష్టి సారించింది. 2026 సెప్టెంబరులో విడుదల చేసిన ప్రపంచ ప్రజారోగ్య ముప్పు అంచనాలో భారత్‌ను అధిక లేదా అత్యధిక ఆరోగ్య ముప్పు ఎదుర్కొనే దేశాల్లో ఒకటిగా WHO గుర్తించింది. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో మార్పులు, నీటి కొరత, వాతావరణ పరిస్థితులకు అనుసంధానమైన వ్యాధుల ముప్పు ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయి.
ఎండల తీవ్రత పెరిగితే డీహైడ్రేషన్, వడదెబ్బ, హీట్‌స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పటికే గుండె, కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అధిక ఉష్ణోగ్రతలు మరింత ఇబ్బందికరంగా మారవచ్చు. వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యవసాయ దిగుబడులు తగ్గితే ఆహార భద్రత, పోషకాహార లభ్యతపైనా ప్రభావం పడవచ్చు. అయితే ఎల్‌నినో నేరుగా వ్యాధులకు కారణం కాదని, పర్యావరణ పరిస్థితుల ద్వారా ఆరోగ్య ముప్పులను పెంచే అవకాశం మాత్రమే ఉందని WHO స్పష్టం చేస్తోంది. గ్రేడ్-3 ప్రకటన ప్రపంచస్థాయి ముందస్తు సంసిద్ధత చర్య మాత్రమే; ప్రతి దేశంలో తక్షణ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందని దీని అర్థం కాదు. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేయడం కీలకం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!