

ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న పలు సంక్షోభాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలు కారణం కాకపోయినా, వాటి ప్రభావంతో ఆ దేశాల ప్రజలే అధికంగా నష్టపోతున్నారని యూకే ముస్లిం ట్రేడ్ ఫోరం చైర్మన్ ఇక్బాల్ సక్రానీ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో “కొత్త ప్రపంచం కోసం కొత్త ఆర్థిక ఒప్పందం” అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. అధిక ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక మందగమనం వంటి సమస్యలను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సమానత్వం, భాగస్వామ్యం, పరస్పర అవగాహన ఆధారంగా కొత్త ఆర్థిక సంబంధాలు ఏర్పడాలని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లభించే సహజ వనరులను సంపన్న దేశాలకు ఎగుమతి చేస్తున్నారని, అక్కడ వాటిని ఉత్పత్తులుగా మార్చి తిరిగి విక్రయిస్తున్నారని సక్రానీ వివరించారు. ఈ విధానంలో వనరులు ఉన్న దేశాలకు తగిన ప్రయోజనం దక్కడం లేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే వనరులను ప్రాసెస్ చేసి ఉత్పత్తులుగా మార్చేందుకు ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అంతర్జాతీయ రుణాలపై ఆధారపడే దేశాలకు అనుకూలమైన వడ్డీ రేట్లు, రుణ నిబంధనలు ఉండాలని అన్నారు. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతి గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించాలని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని సూచించారు. సమానత్వం, శాంతి, పరస్పర సహకారంతో కూడిన ప్రపంచ నిర్మాణానికి భారత్ సమ్మిట్ దోహదపడాలని ఆయన అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!