

మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సరఫరాకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదు. తమ అవసరాల కోసం వారు కేవలం బల్క్ విక్రయ కేంద్రాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రాథమికంగా 90 రోజుల పాటు అమలులో ఉండనున్న ఈ నిబంధనల ప్రకారం, రిటైల్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొనుగోలును ఒక వాహనం లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్లకు పరిమితం చేశారు. అలాగే వాహనాల ఇంధన ట్యాంకులు లేదా పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) అనుమతించిన కంటైనర్లలో మాత్రమే ఇంధనాన్ని విక్రయించనున్నారు. సామాన్య వినియోగదారులకు ఇంధన కొరత తలెత్తకుండా చూడటం, అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!