

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు తరలివస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని, వీఐపీల రాకతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. దర్శనాలు, సౌకర్యాలు, ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. దసరా ఉత్సవాలు వీఐపీలకు మాత్రమే కాకుండా సామాన్య భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు.
విజయవాడ ఉత్సవ్ 2.0ను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు. అక్టోబర్ 13 నుంచి 31 వరకు విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జరిగే జాతీయ సరస్ మేళా–2026లో దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం మొత్తం 576 స్టాళ్లు ఏర్పాటు చేయగా, వాటిలో 208 స్టాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం కేటాయించారు. ‘స్వయం ఏపీ’ బ్రాండ్ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, విక్రయ అవకాశాలు కల్పించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లపైనా సమీక్షలో చర్చించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!