

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ మొదలైంది. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మళ్లీ జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నవంబర్ 25న ముంబై ఇండియన్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ యానిమేటెడ్ చిత్రాన్ని షేర్ చేసింది. అందులో ఓ చేయి ముంబై ఇండియన్స్ క్యాప్ పట్టుకున్నట్లు కనిపించగా, ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ పోస్టు రోహిత్ కెప్టెన్సీ రీఎంట్రీకి సంకేతమంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఐపీఎల్ 2027కు ముందు జరిగిన ట్రేడ్‌లో హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా, అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులో చేరారు. దీంతో ముంబైకి తదుపరి కెప్టెన్ ఎవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ఐదు ఐపీఎల్ టైటిళ్లను కైవసం చేసుకుంది. అయితే 2024 సీజన్‌కు ముందు ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం హార్దిక్ జట్టును వీడటంతో రోహిత్‌కు మళ్లీ అవకాశం దక్కవచ్చనే అంచనాలు పెరిగాయి. కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రోహిత్‌తో ముంబై యాజమాన్యం చర్చలు జరిపినట్లు కొన్ని కథనాలు వెల్లడించినప్పటికీ, ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ మినీ వేలానికి ముందు కెప్టెన్సీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!