

భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్‌లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. దేశీయ అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా అమెరికా కంపెనీల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని యూఎస్ వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్) జేమీసన్ గ్రీర్ తెలిపారు. అయితే భారత్ తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ప్రతిపాదిత సుంకాలను 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వెల్లడించారు. భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా సమాఖ్య, బంగ్లాదేశ్ సహా పలు దేశాలపై కొత్త టారిఫ్‌లను ప్రతిపాదించారు. ఇవి తక్షణమే అమల్లోకి రావని, జనవరి 5లోగా అమెరికా పౌరులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయవచ్చని, జనవరి 25న బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు యూఎస్‌టీఆర్ పేర్కొంది.
అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద పలు దేశాల పారిశ్రామిక ఉత్పత్తులపై నెలలపాటు దర్యాప్తు జరిపిన అనంతరం ఈ ప్రతిపాదనలు చేసినట్లు గ్రీర్ వివరించారు. ఔషధాలు, ఉక్కు, ఐసీటీ ఉత్పత్తుల రంగాల్లో భారత్ అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనలను భారత్ ఖండించింది. దేశంలోని ఏ రంగంలోనూ అవసరానికి మించిన వ్యవస్థాపక ఉత్పత్తి సామర్థ్యం లేదని స్పష్టం చేసింది. వాణిజ్య సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. మరోవైపు బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్‌లపై 18 శాతం, చైనా, వియత్నాంలపై 20 శాతం, ఐరోపా సమాఖ్య, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలపై 15 శాతం టారిఫ్‌లను అమెరికా ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!