

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే దీర్ఘకాలిక పరిష్కారమని లండన్ ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (TfL) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శశి వర్మ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన లండన్ ట్రాఫిక్ నిర్వహణ అనుభవాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పట్టణ రవాణా, మెట్రో రైల్ సలహాదారు ఎన్.వి.ఎస్.రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో పనిచేసిన తనకు.. నగరం సాధించిన అభివృద్ధి ఆశ్చర్యం కలిగించిందని శశి వర్మ పేర్కొన్నారు. లండన్‌లో రైలు, రోడ్డు, మెట్రో, బస్సు, సబర్బన్ రైలు వంటి 14 రవాణా వ్యవస్థలను ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ పరిధిలోకి తీసుకువచ్చి సమన్వయంతో నిర్వహించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నట్లు వివరించారు.
ప్రధాన రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం మాత్రమే ట్రాఫిక్‌కు పూర్తి పరిష్కారం కాదని శశి వర్మ స్పష్టం చేశారు. మెట్రోతోపాటు బస్సు సర్వీసులను గణనీయంగా పెంచాలని, పాదచారులకు మెరుగైన ఫుట్‌పాత్‌లు కల్పించాలని సూచించారు. దీంతో ప్రయాణికులకు చివరి దశ వరకు రవాణా సౌకర్యం అందడంతోపాటు వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతుందని చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ప్రజా రవాణా వినియోగ వాటా 40 శాతానికి పైగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 28 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. ఈ వాటాను తిరిగి 40 శాతానికి చేర్చి, భవిష్యత్తులో 60 శాతాన్ని మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా రవాణా అభివృద్ధికి భారీ పెట్టుబడులతోపాటు విధానపరమైన సంస్కరణలు, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని నియంత్రించే చర్యలు అవసరమన్నారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్.గోపాలకృష్ణ, హైదరాబాద్ మెట్రో అదనపు ఎండీ బి.అజిత్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేశ్, యూఎంటీఏ ఎండీ జీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!