

తెలంగాణలో ధరణి పోర్టల్ భూ రికార్డుల అక్రమాల వ్యవహారంపై సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక బృందాలు రెండు రోజులపాటు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో తాజాగా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయడంతో ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిపై చర్యలు తీసుకున్నట్లయింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ధరణి పోర్టల్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆపరేటర్లు, డేటా ఎంట్రీ సిబ్బందిని విచారించారు. పోర్టల్‌లో అనధికారికంగా లాగిన్ అయి విలువైన భూముల యాజమాన్య హక్కులకు సంబంధించిన రికార్డులను మార్చినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
కోర్టు ఉత్తర్వుల మాటున అక్రమాలకు పాల్పడ్డారా?
న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టులు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని భూ రికార్డుల్లో అక్రమ మార్పులు చేసినట్లు సీఐడీ అనుమానిస్తోంది. ముఖ్యంగా విలువైన భూదాన్ భూములకు అక్రమంగా బైనంబర్లు సృష్టించి, వాటి యాజమాన్య హక్కులను ఇతరులకు బదిలీ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోదాల సందర్భంగా సేకరించిన ఆధారాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సీఐడీ ఉన్నతాధికారులు ఇంకా వెల్లడించలేదు. రానున్న ఒకటి రెండు రోజుల్లో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌లో భూ రికార్డుల మార్పులు, అక్రమ లావాదేవీలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!