

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధానిలో నెలకు రూ.2 వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పరిధిలో చేపట్టిన 152 ప్రాజెక్టుల్లో 41 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి పి. నారాయణ తెలిపారు. గత నెలలో రూ.1,345 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించగా, ఆ మొత్తాన్ని రూ.2 వేల కోట్లకు పెంచాలని సీఎం సూచించారు.
రాజధాని నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును కూడా వేగంగా పట్టాలెక్కించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సచివాలయ టవర్లు, అసెంబ్లీ భవనం వంటి ఐకానిక్ నిర్మాణాల్లో ఆలస్యం ఉండకూడదన్నారు. నిర్మాణ రంగంలోని వారికి ఆధునిక నైపుణ్యాలు అందించాల్సిన అవసరం ఉందని, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ తరహాలో శిక్షణ అందించాలని సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!