

ఎల్‌నినో ప్రభావంతో రానున్న ఎనిమిది నెలలు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలులో ప్రజలను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో భవిష్యత్తులో విద్యుత్ కొరత తీవ్రతరం కావచ్చని హెచ్చరించారు. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవచ్చని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, సాధ్యమైన చోట విద్యుత్ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దసరా తర్వాత సినిమా, మీడియా, కళాజాతలు తదితర మాధ్యమాల ద్వారా వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌పై వాటి ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కరవు మండలాల ప్రకటనతోపాటు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం నుంచి కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సాగులో ఉన్న పంటలకు అవసరమైన నీటిని అందించడం, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడడం, ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించే అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్‌రూమ్, టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాపై సీఎంవో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అక్టోబర్ 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. రాష్ట్రంలోని రైతువేదికల నుంచి రైతులు ఈ సమావేశంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇదే రోజు దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!