

కలుషిత వెన్న విక్రయించిన కేసులో సైనిక్‌పురిలోని రత్నదీప్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, తయారీ సంస్థ అక్షయ కల్పా ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఫిర్యాదు చేసిన వినియోగదారురాలికి రూ.లక్ష పరిహారం, మరో రూ.లక్ష జరిమానా, రూ.10 వేల కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. వెన్న కొనుగోలు కోసం ఆమె చెల్లించిన రూ.230ను కూడా తిరిగి ఇవ్వాలని తీర్పునిచ్చింది. కాప్రాకు చెందిన సంధ్య గత ఏడాది జనవరి 28న రూ.230 చెల్లించి అక్షయ కల్పా ఆర్గానిక్ కుకింగ్ బటర్‌ను కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్ తెరిచి చూడగా బూజు, కంటికి కనిపించే స్థాయిలో కలుషిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై దుకాణ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో తయారీ సంస్థతో పాటు సంబంధిత అధికారులను ఆశ్రయించారు. తయారీ సంస్థ నిర్వహించిన తనిఖీలో దుకాణం సిఫారసు చేసిన నిల్వ ఉష్ణోగ్రతను పాటించలేకపోతున్నట్లు గుర్తించిన విషయాన్ని కమిషన్ ప్రస్తావించింది.
వెన్నను 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలని, మూసివేసిన శీతలీకరణ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, సిబ్బందికి కోల్డ్ చైన్ నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. తాము కేవలం విక్రయదారులమని రత్నదీప్ సంస్థ వాదించగా, ఫిర్యాదు అందిన తర్వాత తనిఖీలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చామని అక్షయ కల్పా సంస్థ తెలిపింది. అయితే ఉత్పత్తి నాణ్యతను కాపాడటంలో రెండు సంస్థలూ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కమిషన్ నిర్ధారించింది. కలుషిత ఆహార పదార్థాల విక్రయంపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను హైదరాబాద్ ఫోరం-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పీవీటీఆర్ జవహర్‌బాబు, వాల సుమలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!