

కేరళలోని కోచిలో జడ్జి మైనర్ కుమారుడు పాల్గొన్న హిట్ అండ్ రన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. త్రిస్సూర్‌కు చెందిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి 17 ఏళ్ల కుమారుడు ఆదివారం తెల్లవారుజామున చెరానెల్లూరులో వేగంగా మెర్సిడెస్ బెంజ్ కారు నడుపుతూ స్కూటర్‌ను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై వెళ్తున్న 55 ఏళ్ల జయబాలకృష్ణన్ మృతిచెందారు. తొలుత కోచి పోలీసులు నిందితుడిపై స్టేషన్ బెయిల్ పొందేందుకు వీలున్న సెక్షన్లతో కేసు నమోదు చేసి విడుదల చేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం మైనర్‌ను తిరిగి అదుపులోకి తీసుకుని జువైనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా, అక్కడ బెయిల్ మంజూరైంది. నిందితుడిని కాపాడేందుకు జడ్జి, పోలీసులు కుమ్మక్కయ్యారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోచి ఐజీ నిశాంతిని పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో కేరళ ప్రభుత్వం కోచి పోలీస్ కమిషనర్ కాళీరాజ్ మహేశ్‌కుమార్‌ను బదిలీ చేయడంతో పాటు ఒక సీఐ, ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. నిందితుడిపై మరణానికి కారణమైన నేరపూరిత చర్యకు సంబంధించిన మరింత తీవ్రమైన సెక్షన్లను చేర్చారు. మైనర్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ జువైనైల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, హైకోర్టు అనుమతితో నిందితుడి తండ్రి అయిన జడ్జిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో, పోలీసుల వ్యవహారశైలిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!