

దుర్భరమైన జీవన పరిస్థితులు, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం లభిస్తుందో లేదోనన్న ఆందోళన, పేదరికంలోకి మరింత కూరుకుపోతామనే భయం, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి, నిత్యావసరాల ధరలు పెరగడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ యువతలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. తమ సమస్యలను ప్రస్తావించినప్పుడు వయసు పేరుతో చిన్నచూపు చూస్తున్నారని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆసియా దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొదలైన జెన్‌జీ నిరసనలు ఇప్పుడు యూరప్‌లోనూ విస్తరిస్తున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, అల్బేనియా, సెర్బియా దేశాల్లో నిరసనలు కొనసాగుతుండగా, వచ్చే వారం జర్మనీలో భారీ ప్రదర్శన నిర్వహించేందుకు యువజన సంఘాలు సిద్ధమవుతున్నాయి. సెర్బియాలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వూచిచ్ పాలనలో అవినీతి, అణచివేత కొనసాగుతున్నాయంటూ యువత నిరసనలు చేపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అసమానతలతో పాటు యువత అభిప్రాయాలు, ఆకాంక్షలను పాలకులు పట్టించుకోవడం లేదనే భావన కూడా ఈ ఉద్యమాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బెల్జియంకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని మాయా గార్డెల్ మాట్లాడుతూ, యువత తమ సమస్యలను ప్రస్తావిస్తే “మీరు చిన్నపిల్లలు, మీకేం తెలుసు?” అంటూ కొట్టిపారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అవసరమైన సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని, కొన్ని పాఠశాల భవనాల భద్రతపైనా ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి పెరగడం, నిత్యావసరాల ధరలు, ఇళ్ల అద్దెలు అధికమవడం యువతపై భారంగా మారాయని చెప్పారు. కష్టపడి చదువుకున్నా తగిన ఉద్యోగం లభిస్తుందన్న నమ్మకం లేకపోవడం తమ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
యూరప్‌లోని పలు దేశాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దాదాపు పది కోట్ల మంది పేదరికం, సామాజిక వెలివేత ముప్పును ఎదుర్కొంటున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నిధుల కొరత కారణంగా ప్రభుత్వాలు వారికి తగిన సహాయం అందించలేకపోతుండగా, సామాజిక భద్రతా పథకాల్లో కోతలు కూడా ప్రజల ఆందోళనను పెంచుతున్నాయి. ఈ ముప్పును ఎదుర్కొంటున్న వారిలో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువత 26.3 శాతంగా ఉన్నట్లు నివేదికలోని గణాంకాలు సూచిస్తున్నాయి. మరోవైపు వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో వారి సంక్షేమానికి అవసరమైన ఖర్చులో ఎక్కువ భాగాన్ని భవిష్యత్తులో తామే భరించాల్సి వస్తుందని కొందరు యువత భావిస్తోంది. ఫ్రాన్స్‌లో 60 ఏళ్లు పైబడినవారు జనాభాలో దాదాపు నాలుగో వంతు ఉండగా, దేశ సంపదలో 60 శాతం వారి చేతుల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రీస్, ఇటలీలు తమ స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 16 శాతాన్ని పెన్షన్ల కోసం ఖర్చు చేస్తుండగా, ఫ్రాన్స్‌లో ఈ వ్యయం దాదాపు 14 శాతంగా ఉంది. ఈ పరిస్థితులు ఆర్థిక వనరుల పంపిణీ, ప్రభుత్వ వ్యయం, యువతకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చకు దారితీస్తున్నాయి. పారిస్‌కు చెందిన 17 ఏళ్ల బిలాల్ నర్జిస్సి మాట్లాడుతూ, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన ఆర్థిక భారం కూడా యువతలో అసంతృప్తిని పెంచుతోందని తెలిపారు. జీవన వ్యయం తగ్గించడం, ఉద్యోగావకాశాలు కల్పించడం, అవినీతిని అరికట్టడం, తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్న డిమాండ్ ఈ నిరసనల్లో ప్రధానంగా కనిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!