

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రణాళిక రూపొందిస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సహకారంతో హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మెరుగుపరిచేందుకు వన్‌వే లూప్ వ్యవస్థను ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక ప్రకారం బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్ సీ-గేట్, నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మీదుగా మై హోమ్ భూజా వద్ద కుడివైపు తిరిగి తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా నిరంతర వన్‌వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా నాలుగు ప్రధాన ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ఆలస్యాన్ని తగ్గించడంతో పాటు రహదారుల పూర్తి వెడల్పును సమర్థంగా వినియోగించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ప్రణాళిక ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉంది.
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారులు, ఎస్‌సీఎస్‌సీ సీఈవో నవీద్ ఖాన్ తమ బృందాలతో కలిసి ప్రతిపాదిత మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారుల ప్రస్తుత పరిస్థితి, ముఖ్యమైన జంక్షన్ల వద్ద ఎదురవుతున్న సమస్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు నిర్వహించి వాహనాల వేగం, రద్దీ తీవ్రత, ప్రతిపాదిత మార్పుల ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థలు, స్థానిక భాగస్వాములతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించనున్నారు. అందరి సూచనలను పరిశీలించి అమలు ప్రణాళికను ఖరారు చేసిన తర్వాతే వన్‌వే లూప్ వ్యవస్థను దశలవారీగా ప్రవేశపెడతామని కమిషనర్ రమేష్ తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మార్పులు, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలను ముందుగానే అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!