

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న ‘మెగావర్స్’ టాక్ షోను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. చిరంజీవిని తమ షోలో భాగం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు గత కొంతకాలంగా ఆయనతో పలుమార్లు చర్చలు జరిపినట్లు సమాచారం. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడటంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు ప్రేక్షకుల్లో టాక్ షోలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘మెగావర్స్’పై అంచనాలు పెరుగుతున్నాయి. చిరంజీవికి హోస్ట్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నాలుగో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
చిరంజీవి ఇప్పటికే ‘మెగావర్స్’ షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. ఈ షోకు సంబంధించిన ఓ ఎపిసోడ్‌లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంతో పాటు నటులు సునీల్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరికొందరు ప్రముఖ సినీ, ఇతర రంగాల సెలబ్రిటీలు కూడా ఈ టాక్ షోలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ హోస్ట్‌గా వ్యవహరించడంతో ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ఆసక్తికరమైన అనుభూతిని అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ‘మెగావర్స్’ ప్రీమియర్ తేదీని నెట్‌ఫ్లిక్స్ ఇంకా ప్రకటించలేదు. అతిథులు, విడుదల షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!