

అమెరికాలోని పలు సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు అకస్మాత్తుగా పనిచేయకపోవడం వెనుక సైబర్ దాడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 12కు పైగా సైనిక స్థావరాల్లోని ఫ్రీజర్లలో సమస్యలు తలెత్తాయి. చల్లబడాల్సిన యూనిట్లు వేడెక్కడం ప్రారంభించడంతో వాటిలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు రాత్రికి రాత్రే పాడైపోయాయి. కొన్ని చోట్ల కూలింగ్ యూనిట్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉదయానికల్లా ఆహారం వినియోగానికి పనికిరాకుండా పోయింది. దీంతో ఆయా స్థావరాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ఆహార కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఒకేసారి అనేక స్థావరాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో, ఫ్రీజర్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లోని సూపర్ మార్కెట్ల రిఫ్రిజిరేటర్ వ్యవస్థలపై కూడా ఇలాంటి సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. హ్యాకర్లు ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలను పెంచడంతో అందులోని ఆహార పదార్థాలు పాడయ్యాయి. ఈ సైబర్ ఘటనను ఫ్రాన్స్ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో అమెరికా సైనిక స్థావరాల్లోనూ ఇదే తరహా దాడి జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెంటగాన్ విచారణ ప్రారంభించడంతో పాటు ఫ్రాన్స్ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతోంది. యూఎస్ సైబర్ కమాండ్‌కు చెందిన ఓ విభాగం, ఆర్మీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ సైబర్ ఫీల్డ్ ఆఫీస్ సహా పలు సంస్థలు ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయి. అయితే అమెరికా, ఫ్రాన్స్‌లో జరిగిన ఘటనల మధ్య సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు ఇప్పటివరకు లేవు. శత్రు దేశాల ప్రమేయం లేదా ఇతర భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!