

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చిన మురసు తుఫాన్ ప్రస్తుతం తీరం దాటే ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు గంటల సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరానికి మరింత చేరువైంది. ప్రస్తుతం ఒంగోలుకు 20 కిలోమీటర్లు, బాపట్లకు 60 కిలోమీటర్లు, కావలికి 70 కిలోమీటర్లు, నెల్లూరుకు 110 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 130 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ఎండీ, ఆర్‌టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో బాపట్ల, నెల్లూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!