

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదిస్తూ, ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు నిర్ధారించి అనర్హత వేటు వేయడం సరికాదని పేర్కొన్నారు.
2024 మార్చి 15న ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని దానం నాగేందర్ కలిశారని, కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు వార్తా కథనాలు సమర్పించారని, అయితే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన ఎక్కడా స్వచ్ఛందంగా ప్రకటించలేదని న్యాయవాది తెలిపారు. బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు నిర్ధారించేందుకు వార్తా కథనాలు మాత్రమే సరిపోవని వాదించారు. దానం సభ్యత్వాన్ని వదులుకున్నట్లు బీఆర్‌ఎస్ నుంచి స్పీకర్‌కు ఎలాంటి లేఖ రాలేదని, శాసనసభ బులెటిన్‌లో ఇప్పటికీ ఆయనను బీఆర్‌ఎస్ సభ్యుడిగానే చూపిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!