

దీపావళి పండగను పురస్కరించుకుని దిల్లీకి చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు ఊహించని కానుక అందించింది. రోహిణి ప్రాంతంలోని ‘ఫైనాన్సర్‌సాబ్’ సంస్థ తమ ఉద్యోగులందరికీ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగులు ఆఫీసుకు రాకముందే యాజమాన్యం వారి డెస్క్‌లపై కొత్త ఐఫోన్లను ఏర్పాటు చేసింది. కార్యాలయానికి చేరుకున్న ఉద్యోగులు తమ డెస్క్‌లపై ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను చూసి ఆనందంతో ఆశ్చర్యపోయారు. ఈ వినూత్న బహుమతి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ సర్‌ప్రైజ్‌కు సంబంధించిన వీడియోను సంస్థ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘మీ కంపెనీలు మీకు ఏం బహుమతిగా ఇచ్చాయి?’ అంటూ సరదా క్యాప్షన్‌ను జత చేసింది. సాధారణంగా దీపావళి సందర్భంగా చాలా సంస్థలు ఉద్యోగులకు స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, నిత్యావసర వస్తువులను అందిస్తుంటాయి. అయితే అందుకు భిన్నంగా ఐఫోన్లను బహుమతిగా ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ కంపెనీలో ఏమైనా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయా?’ అంటూ ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేయడం విశేషం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!