

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరుల్లో గతంలోని హైజాక్ ఘటనల జ్ఞాపకాలు మరోసారి చర్చకు వచ్చాయి. అలాంటి ఘటనల్లో 1976లో జరిగిన ఎంటెబె హైజాక్ అత్యంత కీలకమైనది. జూన్ 27న టెల్ అవీవ్ నుంచి పారిస్‌కు బయల్దేరిన ఎయిర్‌ఫ్రాన్స్ 139 విమానం ఏథెన్స్‌లో ఆగిన అనంతరం హైజాక్‌కు గురైంది. ఉగ్రవాదులు విమానాన్ని ఉగాండాలోని ఎంటెబె విమానాశ్రయానికి తరలించారు. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రయాణికులను బందీలుగా ఉంచారు. ఇజ్రాయెల్ సహా యూదు ప్రయాణికులను ప్రత్యేకంగా నిర్బంధించగా, వారిని విడిపించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమవడంతో సైనిక చర్యకు ఇజ్రాయెల్ సిద్ధమైంది.
మొస్సాద్ సేకరించిన సమాచారంతో ఎంటెబె విమానాశ్రయ నిర్మాణం, టెర్మినల్ వివరాలపై ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళిక రూపొందించింది. జులై 3 రాత్రి ఇజ్రాయెల్ కమాండోలు ఉగాండాలోకి చేరుకుని, ఉగాండా అధ్యక్షుడు ఉపయోగించే వాహనాలను పోలిన కార్లతో భద్రతా సిబ్బందిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అనంతరం టెర్మినల్‌లోకి ప్రవేశించి హైజాకర్లపై దాడి చేసి బందీలను విడిపించారు. ఈ ఆపరేషన్‌కు యొనాతన్ నెతన్యాహు నాయకత్వం వహించారు. బందీలను తరలించే సమయంలో జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు బందీలు కూడా మరణించగా, పలువురు గాయపడ్డారు. సుమారు 53 నిమిషాల్లో ఆపరేషన్ ముగిసింది. తొలుత ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’గా పిలిచిన ఈ చర్యను అనంతరం ‘ఆపరేషన్ యొనాతన్’గా మార్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!