

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 1975లో తన కుటుంబం విషాద పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో భారత్ అందించిన ఆశ్రయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల అంతర్జాతీయ మీడియా సంస్థతో వర్చువల్‌గా మాట్లాడిన ఆమె.. తనకు మరోసారి అండగా నిలిచిన భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. 1975 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన సైనిక తిరుగుబాటులో ఆమె తండ్రి, దేశ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, తల్లి, ముగ్గురు సోదరులు సహా పలువురు కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటంతో హసీనా, ఆమె చెల్లెలు షేక్ రెహానా ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ వారికి ఆశ్రయం కల్పించారు. ఆరేళ్ల తర్వాత 1981 మేలో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిన హసీనా, ఆ దేశ రాజకీయాల్లో కీలక నాయకురాలిగా ఎదిగారు.
డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని హసీనా స్పష్టం చేశారు. తిరుగు ప్రయాణంపై తనకు భయం లేదని, తనను హత్య చేయవచ్చని, హింసించవచ్చని లేదా అరెస్టు చేయవచ్చని తెలిసినా స్వదేశానికి వెళ్లడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, తిరిగి వెళ్లే తేదీని మాత్రం ఆమె వెల్లడించలేదు. తనపై, తన మద్దతుదారులపై నమోదైన కేసుల విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. భారత్ అందించిన ఆశ్రయానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న తన సంకల్పాన్ని హసీనా మరోసారి స్పష్టం చేశారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!