

జిల్లాలోని పలు ఆహార తయారీ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కొందరు వ్యాపారులు నాసిరకం ముడిసరుకుతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో మిఠాయిలు, ఖారీ తదితర తినుబండారాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలో 14 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగి 28 హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కేంద్రాలు, మిఠాయి దుకాణాలు, బేకరీలను పరిశీలించగా పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.
నిబంధనలకు విరుద్ధంగా తయారైన 9,645 కిలోల ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.17,28,495గా అంచనా వేసి, వాటిని ధ్వంసం చేశారు. మిర్చి కాంపౌండ్‌లోని ఓ స్వీట్ అండ్ బేకరీ, దుబ్బాలోని స్వీట్స్, ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం, ఆటోనగర్‌లోని బేకరీలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి మూసివేశారు. మరికొన్ని కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. పలు చోట్ల గడువు తీరిన కారం, పసుపు, అల్లం వంటి ముడిసరుకును వినియోగిస్తున్నట్లు, ఆహార పదార్థాలను నేలపైనే తయారు చేసి నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఎలుకలు, బొద్దింకలు సంచరిస్తుండటంతో పాటు ఈగలు వాలుతున్నట్లు వెల్లడైంది. లూజ్ ప్యాకెట్లలోని నాసిరకం సుగంధ ద్రవ్యాల పొడులను కూడా గుర్తించారు. మొత్తం 26 నమూనాలను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించారు. నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత శాఖ డిప్యూటీ డైరెక్టర్ సునీత తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!