

హైదరాబాద్ మెట్రోరైలు టికెటింగ్ విధానంలోని కొన్ని పరిమితులు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు టికెట్ తీసుకున్న ఓ ప్రయాణికుడు అత్యవసర పరిస్థితుల్లో నాంపల్లిలో దిగేందుకు ప్రయత్నించగా, క్యూఆర్ కోడ్ ఉన్న పేపర్ టికెట్‌తో ఎగ్జిట్ గేటు తెరుచుకోలేదు. దీంతో స్టేషన్ కంట్రోలర్‌ను సంప్రదించాల్సి వచ్చింది. చివరకు సిబ్బంది తమ వద్ద ఉన్న మెట్రో కార్డును స్కాన్ చేయడంతో ఆయన బయటకు వెళ్లగలిగారు. మరో ఘటనలో జేఎన్టీయూ నుంచి బేగంపేట వరకు యాప్ ద్వారా డిజిటల్ టికెట్ తీసుకున్న ఓ ప్రయాణికుడు, స్నేహితుడు కేపీహెచ్‌బీ స్టేషన్ వద్ద దించడంతో అక్కడి నుంచి మెట్రో ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే టికెట్లో ఎక్కాల్సిన స్టేషన్ వేరుగా ఉండటంతో ఎంట్రీ గేటు తెరుచుకోలేదు.
టికెట్లో పేర్కొన్న గమ్యస్థానం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అదనపు ఛార్జీ చెల్లించిన తర్వాతే బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని మెట్రో సిబ్బంది చెబుతున్నారు. అయితే గమ్యస్థానానికి ముందే దిగాలన్నా, టికెట్లో పేర్కొన్న స్టేషన్ కాకుండా మధ్యలోని మరో స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించాలన్నా ఎందుకు అనుమతించరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ వేళల్లో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఒక స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసి, వారు మరో స్టేషన్ నుంచి ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. టికెట్ కొనుగోలు చేసే సమయంలో ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్ వివరాలు కోడ్ రూపంలో నమోదవుతాయని, వేరే స్టేషన్లో స్కాన్ చేస్తే వ్యవస్థ వాటిని గుర్తించదని మెట్రో సిబ్బంది వివరిస్తున్నారు. ఈ విధానంలో ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించాలని పలువురు కోరుతున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!