

నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బలిజ సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాల మద్దతు తమకు ఉందని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటికీ, ఆ మద్దతు ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించలేదు. మున్సిపాలిటీలోని మొత్తం 52 వార్డుల్లో ఏడు స్థానాలను కేటాయించాలని జనసేన కోరగా, కేవలం రెండు వార్డుల్లో మాత్రమే పోటీ చేసే అవకాశం లభించింది. 17వ వార్డులో రాచమడుగు లక్ష్మీదేవి, 41వ వార్డులో పిడతల సుధాకర్ జనసేన తరఫున బరిలోకి దిగారు. అయితే ఈ రెండు వార్డుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు నిరాశ ఎదురైంది.
మరోవైపు, డోన్ పట్టణంలోని 7వ వార్డు ఎన్నికల ఫలితంపై వివాదం నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రుక్సానా తన సమీప టీడీపీ ప్రత్యర్థి పఠాన్ ఖైరున్నీసాపై మూడు ఓట్ల తేడాతో గెలిచినట్లు తొలుత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. గంట తర్వాత నిర్వహించిన రీకౌంటింగ్‌లోనూ ఇదే ఫలితాన్ని వెల్లడించడంతో పాటు, కౌంటింగ్ అధికారి సంతకం కూడా చేసినట్లు సమాచారం. అయితే మరో గంట తర్వాత బయట ఏర్పాటు చేసిన డిస్‌ప్లేలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు చూపించారు. ఈ విషయంపై బుధవారం విలేకరులతో మాట్లాడిన రుక్సానా, తనకు 451 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 448 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. న్యాయవాదులతో కలిసి రిటర్నింగ్ అధికారిని కలిసేందుకు ప్రయత్నించగా, ఎన్నికల ఫలితాలన్నీ వెల్లడైన తర్వాతే రీకౌంటింగ్ చేస్తామని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తనకు అన్యాయం చేశారని ఆరోపించిన రుక్సానా, న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!