

పేదరికం నుంచి ఎదిగి వైద్యుడిగా గుర్తింపు పొందిన పుణెకు చెందిన డాక్టర్ గణేశ్ రాఖ్ తన వినూత్న సేవతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పుణెలోని హడప్సర్‌లో చిన్న ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన తండ్రి మార్కెట్‌లో ధాన్యం బస్తాలు మోస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తల్లి ఇతరుల ఇళ్లలో గిన్నెలు కడుగుతూ జీవనం సాగించేవారు. చిన్నతనంలో తండ్రికి తోడుగా గణేశ్ కూడా ధాన్యం బస్తాలు మోసేవారు. స్కాలర్‌షిప్‌ల సహాయంతో చదువుకున్న ఆయన 2007లో మెడికేర్ ఆసుపత్రిని ప్రారంభించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆడపిల్ల పుడితే కొన్ని కుటుంబాలు విచారం వ్యక్తం చేయడం, బంధువులు దూరంగా ఉండటం, ఆసుపత్రి బిల్లులో రాయితీ కోరడం ఆయనను తీవ్రంగా కలచివేసింది.
ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్న గణేశ్ రాఖ్ 2012 జనవరి 3న సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మిస్తే ప్రసవ ఖర్చులను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు, ఆ చిన్నారికి కేక్, పూలు, స్వీట్లతో ఘనంగా స్వాగతం పలకడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో ఆయన భార్య, సోదరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ తండ్రి మాత్రం అండగా నిలిచారు. 2025 నాటికి ఈ కార్యక్రమం ద్వారా 2,500 మందికి పైగా ఆడపిల్లలకు ప్రత్యేక స్వాగతం పలికారు. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఆయన ఇతర వైద్యులు, కుటుంబాలకు కూడా ఆడపిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం బస్తాలు మోసిన వ్యక్తి, నేడు ఆడపిల్లల పుట్టుకను పండుగలా మార్చుతూ సమాజానికి గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!