

విదేశీ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (BFSI) సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటుకు భారత్‌ను ప్రాధాన్య గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. దీంతో దేశంలోని వాణిజ్య కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ ఇండియా ప్రకారం.. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో విదేశీ BFSI సంస్థలు రికార్డు స్థాయిలో 73.2 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఆర్థిక సేవలకు సంబంధించిన కార్యకలాపాలు, సాంకేతిక విభాగాలు, ఇతర గ్లోబల్ విధుల కోసం భారత్ కీలక కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, విదేశీ ఐటీ-ఐటీఈఎస్ సంస్థలు GCCల ఏర్పాటుకు అద్దెకు తీసుకున్న కార్యాలయ స్థలంలో తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈ సంస్థలు 41.3 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని మాత్రమే లీజుకు తీసుకున్నాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో ఈ పరిమాణం 57.1 లక్షల చదరపు అడుగులుగా ఉంది. దీంతో ఐటీ-ఐటీఈఎస్ రంగంతో పోలిస్తే BFSI సంస్థల నుంచి GCCలకు సంబంధించిన కార్యాలయ స్థల డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!