

తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయంలోని అన్నప్రసాద తయారీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. ఈ ఘటనతో భారీ శబ్దం రావడంతో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన నల్లటి పొగ వ్యాపించడంతో ఏం జరిగిందో తెలియక భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. రాహుకేతు పూజల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం శ్రీకాళహస్తికి వస్తుంటారు.
ప్రమాదం జరిగిన సమయంలో అన్నప్రసాద కేంద్రంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటలు సమీపంలోని ఇతర గ్యాస్ సిలిండర్లకు కూడా వ్యాపించినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, ఆలయ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగిందా, లేక మరేదైనా కారణముందా అనే కోణంలో అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో అగ్నిప్రమాద నివారణకు తగిన భద్రతా చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశాన్ని దేవాదాయశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!