

తెలంగాణలో క్రిస్మస్ వేడుకలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ 2026 వేడుకల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన రిజిస్టర్డ్ చర్చిలకు ఒక్కొక్కదానికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని అర్హత కలిగిన చర్చిలకు కూడా ఈ సాయం వర్తించనుంది. చర్చిలకు వైట్‌వాషింగ్, విద్యుత్ అలంకరణల కోసం ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను మంజూరు చేయనున్నట్లు సమాచారం.
ఈ సాయం పొందేందుకు చర్చిల ప్రతినిధులు నవంబర్ 23 నుంచి 30 వరకు TG-OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు చర్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మేనేజ్‌మెంట్ కమిటీ తీర్మానం, చర్చి బ్యాంక్ పాస్‌బుక్, క్యాన్సిల్డ్ చెక్, పాస్టర్ లేదా అధ్యక్షుడి ఆధార్ కార్డు, చర్చి తాజా ఫొటోలు సమర్పించాలి. అలాగే నిధులను కేవలం వైట్‌వాషింగ్, విద్యుత్ అలంకరణల కోసమే వినియోగిస్తామని హామీ పత్రం జతచేయాలి. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత జిల్లా అధికారులు నియోజకవర్గాల వారీగా కోటా విధానంలో నిధులను కేటాయించనున్నారు. నవంబర్ 30 తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!