

జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన మావోయిస్టులకు పునరావాసం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 214 మంది మాజీ మావోయిస్టులకు మొత్తం రూ.5.59 కోట్ల నగదు రివార్డులు, పునరావాస ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయంతో పాటు ఆరోగ్య భద్రత, నివాస వసతి, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇప్పటివరకు 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. వీరిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు 754 మంది, తెలంగాణకు చెందినవారు 59 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు తొమ్మిది మంది, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు రూ.17.68 కోట్ల నగదు రివార్డులు, పునరావాస సాయం పంపిణీ చేసినట్లు చెప్పారు. 59 మందికి ఆరోగ్య రక్షణ కార్డులు అందించగా, తెలంగాణకు చెందిన 10 మందికి ఇళ్ల మంజూరు పూర్తయిందని, మరో 49 మందికి ఇళ్లు కల్పించనున్నట్లు వివరించారు. కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటి వృత్తుల్లో నైపుణ్య శిక్షణతో పాటు డ్రైవింగ్ శిక్షణ కూడా అందించనున్నట్లు తెలిపారు. మిగిలిన ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు, కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో సహా, లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని డీజీపీ పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!