

ఫుట్‌పాత్‌పై బైక్‌లతో వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు వాహనదారులను ముగ్గురు యువతులు ధైర్యంగా అడ్డుకున్నారు. వెనుక నుంచి బైకర్లు పదేపదే హారన్లు మోగిస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఫుట్‌పాత్‌పైనే నడుచుకుంటూ వెళ్లారు. ఫుట్‌పాత్‌లు పాదచారుల కోసమేనని, వాటిపై వాహనాలు నడపడం సరికాదని తమ చర్యతో స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ అగ్నిమాపక శాఖ, ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీఎఫ్) డీజీ సజ్జనర్ స్పందించారు. బైకర్ల ఒత్తిడికి తలొగ్గకుండా నిబంధనల ఉల్లంఘనను ప్రశ్నించిన యువతుల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టిన సజ్జనర్.. ఫుట్‌పాత్‌లు పాదచారుల హక్కు అని, ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఉపయోగించే అడ్డదారి కాదని పేర్కొన్నారు. వెనుక నుంచి బైకర్లు హారన్లు మోగిస్తున్నా బెదరకుండా ముందుకు సాగిన యువతుల తెగువ సమాజానికి మంచి సందేశమని కొనియాడారు. నిమిషం ఆలస్యాన్ని కూడా భరించలేని వాహనదారుల అసహనం ఇతరుల భద్రతను, నడిచే హక్కును దెబ్బతీస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిబంధనల ఉల్లంఘనను బాధ్యతాయుతంగా ప్రశ్నించాలని సూచించారు. పాదచారుల హక్కులను గౌరవిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే రహదారులు సురక్షితంగా మారుతాయని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!