

టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ గవర్నర్, తెలంగాణ ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమీక్ష సమావేశంలో ఆయన రాష్ట్రంలో క్షయవ్యాధి నిర్మూలనకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. టీబీ గుర్తింపు, నిర్ధారణ, చికిత్స, పోషకాహార సహాయం, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 171 టీబీ యూనిట్లు, 435 నిర్ధారణ కేంద్రాలు, 191 ర్యాపిడ్ మాలిక్యులర్ టెస్టింగ్ కేంద్రాలు, 52 పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఇటీవల నిర్వహించిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో 3.87 లక్షల మందికి పైగా హైరిస్క్ వర్గాలను స్క్రీనింగ్ చేసి, 1.68 లక్షల ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి, 7,663 మంది కొత్త టీబీ రోగులను గుర్తించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 28 వేల మంది టీబీ రోగులు చికిత్స పొందుతున్నారని గవర్నర్ తెలిపారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అవగాహన పెంచడం, రోగులు ఆరు నెలల చికిత్సను పూర్తిచేసేలా చూడడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!