

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించిన తొలి ఏడాదిలో టెస్లా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. జూలై 2025లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి కంపెనీ కేవలం 486 ఎలక్ట్రిక్ వాహనాలనే విక్రయించింది. ప్రస్తుతం టెస్లా భారత్లో పూర్తిగా దిగుమతి చేసుకునే మోడల్ వై (Model Y)ను మాత్రమే విక్రయిస్తోంది. అధిక దిగుమతి సుంకాల కారణంగా దీని ధర ఎక్కువగా ఉండటం, అలాగే షోరూమ్లు, సర్వీస్ సెంటర్లు పరిమితంగా ఉండటం అమ్మకాలపై ప్రభావం చూపిన ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు, దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తూ 2026 తొలి ఆరు నెలల్లోనే కొత్త సియెరా ఎస్యూవీ 43 వేలకుపైగా యూనిట్లను విక్రయించింది. సరసమైన ధరలు, దేశీయ తయారీ, విస్తృత సర్వీస్ నెట్వర్క్ వంటి అంశాలు టాటా విజయానికి బలంగా నిలిచాయని విశ్లేషకులు చెబుతున్నారు. టెస్లా భారత మార్కెట్లో బలపడాలంటే తక్కువ ధరల మోడళ్లను ప్రవేశపెట్టడం, ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించడం, దేశీయంగా తయారీ ప్రారంభించడం వంటి చర్యలు కీలకమని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!