

మెదక్ జిల్లాలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్న గవర్నర్.. 2.40 గంటలకు మాదకద్రవ్యాల రహిత భారత్ ర్యాలీని ప్రారంభించనున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. అలాగే నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
పర్యటనలో భాగంగా దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి గవర్నర్ శ్రీకారం చుట్టనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా రామాయంపేట–సిద్దిపేట మధ్య జాతీయ రహదారి 765 డీజీ వెంట 35 వేల మొక్కలు నాటనున్నారు. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 3.30 గంటలకు రామాయంపేటలోని అమోఘ్ హోటల్ సమీపంలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద గవర్నర్ ప్రారంభించి మొక్కలు నాటనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!