

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా అమలు చేస్తున్న వన్‌వే విధానం విజయవంతం కావడంతో, గతంలో ప్రతిపాదించిన వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికను మార్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో సిగ్నళ్ల వద్ద వాహనాలు నిమిషాల తరబడి నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. ప్రస్తుతం వన్‌వే విధానంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతుండటంతో భారీ వ్యయంతో అన్ని ప్రాజెక్టులను చేపట్టాల్సిన అవసరం ఉందా అనే అంశంపై అధికారులు పునరాలోచన చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ప్రణాళికలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి చెక్‌పోస్ట్ మీదుగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వరకు ఇరు వైపులా రాకపోకలు సాగించేలా ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదిస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలతో పాటు ఐటీ కారిడార్ నుంచి వచ్చే వాహనాలు సిగ్నళ్లను తప్పించుకుని ప్రయాణించేలా దీనిని రూపొందించే అవకాశం ఉంది. పంజాగుట్ట నుంచి ఓఆర్‌ఆర్ వైపు వెళ్లే వాహనాలు మాత్రం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్న కేబీఆర్ పార్క్ వన్‌వే మార్గాన్ని ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1,090 కోట్లతో ప్రతిపాదించిన వంతెనలు, అండర్‌పాస్‌లకు బదులుగా కొత్త ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఆస్తుల సేకరణ, నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొదటి ప్రణాళికలో 237 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, ఇందుకోసం రూ.1,048 కోట్ల పరిహారం అవసరమవుతుందని అంచనా వేశారు. కొత్త ప్రణాళికలో పంజాగుట్ట నుంచి చెక్‌పోస్ట్ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఆరు వరుసల కారిడార్‌ను పరిశీలిస్తున్నారు. అగ్రసేన్ జంక్షన్ వద్ద ఇప్పటికే చేపట్టిన అండర్‌పాస్ పనులను నిలిపివేసి, రిటైనింగ్ వాల్ నిర్మించి రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. తుది డిజైన్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!