

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ విషయాన్ని తెలిపారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమొరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, చార్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ స్కూల్స్ సీఈఓ ఫ్లోరా హామిల్టన్‌తో పాటు సుమారు 30 మంది యూకే యూనివర్సిటీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఎంఐటీ, పర్డ్యూ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రక్రియ కొనసాగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీలు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, అక్కడ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు యూకే విద్యా రంగ ప్రతినిధులను ఆహ్వానించిన సీఎం, 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!