

‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనలో బ్యాంకింగ్ రంగం పాత్రను సమీక్షించేందుకు త్వరలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ కమిటీ బ్యాంకింగ్ రంగానికి దీర్ఘకాలిక భవిష్యత్ ప్రణాళికను రూపొందించడంతో పాటు, రాబోయే రెండు దశాబ్దాల్లో దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన మార్పులు, సంస్కరణలను సూచించనుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల సదస్సులో మాట్లాడిన ఆమె.. బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై తమ సూచనలు, సిఫార్సులు అందించాలని బ్యాంకు అధిపతులను కోరారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో 20 ఏళ్లు మాత్రమే ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిరర్థక ఆస్తులు (NPAs) తక్కువ స్థాయిలో ఉన్నందున సంస్కరణలను వేగవంతం చేయడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. యువతకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు మద్దతు, ప్రాధాన్య రంగాలకు రుణాల విస్తరణ, క్రెడిట్ కార్డు వ్యాపార పునర్నిర్మాణం వంటి ఏడు అంశాలను చర్చకు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంకులు తమ భవిష్యత్ ప్రణాళికల్లో దేశ జనాభా నిర్మాణం, ముఖ్యంగా యువత అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!