

నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కోసం నిర్మించిన ‘ఈగిల్స్ నెస్ట్’ అనే పర్వత విడిది భవనంలో అక్టోబర్ 23, 2026 రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్‌లో ఉన్న ఈ చారిత్రక కట్టడంలో ఫైర్ అలారం మోగడంతో అత్యవసర సిబ్బందికి సమాచారం అందింది. అయితే, పర్వత ప్రాంతంలో ఉన్న భవనానికి చేరుకోవడం, మంటలను అదుపు చేయడం సిబ్బందికి కష్టంగా మారింది. హిమపాతం, బలమైన గాలులు సహాయక చర్యలకు ఆటంకం కలిగించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికి భవనం మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం లోపల ఎవరూ లేరని వెల్లడించారు. అగ్నిప్రమాదంతో చారిత్రక కట్టడం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి నిప్పంటించారనే అనుమానంతో 33 ఏళ్ల జర్మన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిలో మానసిక సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో తదుపరి పరిశీలన కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి కారణమేంటి, దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఘటన వెనుక ఉద్దేశం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సముద్ర మట్టానికి సుమారు 1,834 మీటర్ల ఎత్తులో ఉన్న ఈగిల్స్ నెస్ట్‌ను 1930ల చివర్లో నాజీ నాయకత్వం కోసం నిర్మించారు. 1952 నుంచి ఈ భవనాన్ని రెస్టారెంట్‌గా, నాజీ చరిత్రను వివరించే ప్రదర్శనశాలగా నిర్వహిస్తున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!