

దీపావళి పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో మిఠాయిలను విక్రయించేందుకు సిద్ధమైన హరియాణా వ్యాపారికి తేనెటీగల దండు షాక్ ఇచ్చింది. ఫతేబాద్‌లోని భివానీ ప్రాంతంలో ఓ వ్యాపారి పండుగ కోసం భారీగా స్వీట్లు తయారు చేయించి, వాటిని విక్రయించేందుకు బహిరంగంగా స్టాల్ ఏర్పాటు చేశాడు. మిఠాయిల వాసనకు సమీపంలోని తేనెటీగల గుంపు అక్కడికి చేరుకుంది. ఒక్కసారిగా స్వీట్లపై వాలడంతో స్టాల్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వాటిని వెళ్లగొట్టేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు సమాచారం.
స్వీట్లపై తేనెటీగలు గుంపులుగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రాలేదు. దీంతో పెద్ద మొత్తంలో మిఠాయిలు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. చివరకు వాటిలో కొన్నింటిని పలువురికి ఉచితంగా పంచాల్సి వచ్చిందని వ్యాపారి తెలిపారు. ఈ ఘటన వల్ల సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!