

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి స్థలం పట్టా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఈ రోజు జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదలకు ఇళ్ల పట్టాలు, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణపై ఆయన సమీక్షించారు. ఇప్పటివరకు 1.43 లక్షల మందిని ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించామని, మరో 1.26 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్ 15 నాటికి పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు. 1,692 గ్రామాల్లో సుమారు 18 వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు భూమిని గుర్తించినట్లు వివరించారు. కొత్తగా ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, ఎంతమంది స్థలాలను క్రమబద్ధీకరించాలనే అంశంపై స్పష్టమైన జాబితా రూపొందించాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 5.92 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 5.32 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న అన్ని ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీకి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 10 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ఈ అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇన్‌ఛార్జి మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!