

కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాత ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోలకపోవడం, పేర్లలో వ్యత్యాసాలు వంటి కారణాలతో పలువురు ప్రముఖుల వివరాలు కూడా వెరిఫికేషన్ పరిధిలోకి వచ్చాయి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన కుటుంబ సభ్యులు, జెరోదా వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నందన్ నీలేకని, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను 2002 నాటి ఓటర్ల జాబితాతో వివరాలు సరిపోలని ‘అన్‌మ్యాప్డ్’ కేటగిరీలో చేర్చినట్లు సమాచారం. బెంగళూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో నితిన్ కామత్, నిఖిల్ కామత్, వారి తల్లి రేవతి కామత్‌కు సంబంధించిన తల్లిదండ్రుల పేర్లలోనూ మిస్‌మ్యాచ్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
వెరిఫికేషన్ ప్రక్రియలో ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత సిబ్బంది వారి వద్దకే వెళ్లి వివరాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, భారతరత్న గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు పేరులో స్వల్ప వ్యత్యాసం కారణంగా SIRలో ఇబ్బందులు ఎదురయ్యాయంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే గత ఓటర్ల జాబితాతో పోల్చితే ఆయన పేరులో కొంత తేడా ఉన్నప్పటికీ, ఎలాంటి నోటీసూ జారీ చేయలేదని గ్రేటర్ బెంగళూరు ప్రధాన కమిషనర్ ఎం. మహేశ్వరరావు స్పష్టం చేశారు. కర్ణాటకలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వివరాల సరిపోలిక, ధ్రువీకరణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!