

హుద్‌హుద్ తుపాను కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కల్పించేందుకు నిర్మించిన గృహాలు ప్రస్తుతం ఆక్రమణలు, నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కంకరబంద ప్రాంతంలో 2016లో మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో జీ+2 విధానంలో 196 ఇళ్లను నిర్మించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ఇళ్ల కేటాయింపును తాత్కాలికంగా వాయిదా వేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా పంపిణీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో తలుపులు, కిటికీలు, విద్యుత్ వైరింగ్, తాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయి. సగానికిపైగా ఇళ్లకు తలుపులు లేకుండా పోగా, కొందరు రెండు మూడు ఇళ్లను అనధికారికంగా వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు, ఈ భవనాలు రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిలు ఇళ్లలోకి చొరబడి తలుపులు, కిటికీలు ధ్వంసం చేయడమే కాకుండా, తాళాలు వేసి ఉన్న ఇళ్లలోకి సైతం బలవంతంగా ప్రవేశిస్తున్నారని చెబుతున్నారు. పరిసర ప్రాంతాల్లో నివసించే మహిళలు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. నిర్వహణ లేకపోవడంతో ఇళ్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, రాత్రివేళ విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంపై గృహనిర్మాణశాఖ పీడీ నర్సింగరావు స్పందిస్తూ, హుద్‌హుద్ గృహాల్లో అక్రమ చొరబాట్లను ఉపేక్షించబోమని తెలిపారు. వెంటనే సిబ్బందిని పంపించి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశిస్తామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!