

హైదరాబాద్‌లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ IEC (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించగా, దోమల నియంత్రణకు వినియోగిస్తున్న పరికరాలను ఆయన పరిశీలించారు. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను అరికట్టడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయనున్నారు.
ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంటింటికీ వెళ్లి నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్స్, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫాగింగ్, కరపత్రాల పంపిణీ, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు సూచించారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ప్రభుత్వ చర్యలకు సహకరించాలని కోరారు. GHMC చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. అమర్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. ఇంటింటికీ IEC కార్యక్రమం ద్వారా దోమల నియంత్రణ, నీటి నిల్వల తొలగింపు, వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!