

హైదరాబాద్‌లో మెట్రో రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచే డ్రైవర్ లేని పాడ్ ట్యాక్సీ ఎక్కి నేరుగా తమ కార్యాలయాలకు చేరుకునేలా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్)ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఐటీ కారిడార్, సచివాలయం, పరిసర ప్రాంతాలను కలుపుతూ మొత్తం 40.82 కిలోమీటర్ల నెట్వర్క్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికపై హెచ్ఎంఆర్ఎల్ అధికారులు రూపొందించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు నెలల పాటు అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్ సంస్థ 44.62 కి.మీ., 56.98 కి.మీ. మార్గాల ప్రతిపాదనలను పరిశీలించి, వాటిని సమన్వయం చేసిన 40.82 కి.మీ. హైబ్రిడ్ నెట్‌వర్క్‌ను అనుకూలంగా సూచించింది.
ప్రతిపాదిత నెట్‌వర్క్‌లో కూకట్పల్లి–రాయదుర్గం జోన్ 7.62 కి.మీ., రాయదుర్గం–నాలెడ్జ్ సిటీ జోన్ 12.83 కి.మీ., రాయదుర్గం/హైటెక్ సిటీ–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జోన్ 14.01 కి.మీ., సచివాలయం–ఎన్టీఆర్ మార్గ్ కారిడార్ 6.36 కి.మీ. మేర ఉంటాయి. 2030 నాటికి 34.66 కి.మీ., 2040 నాటికి 39.36 కి.మీ. నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, 2050 నాటికి పూర్తి ప్రాజెక్టును ముగించాలని లక్ష్యంగా ప్రతిపాదించారు. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2030లో 5.42 లక్షలు, 2040లో 15.47 లక్షలు, 2050లో 20.31 లక్షలకు చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని 69 కి.మీ. మెట్రో నెట్‌వర్క్‌లో రోజుకు సుమారు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే పాడ్ ట్యాక్సీ ప్రాజెక్టు మొత్తం వ్యయం, టికెట్ ధరలు, నిర్మాణ గడువును ఇంకా వెల్లడించలేదు. దేశంలో ముంబై బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో 8.85 కి.మీ. పాడ్ ట్యాక్సీ ప్రాజెక్టును రూ.1,016 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!