

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరగనుంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరుపై ఈ భేటీలో సమీక్ష నిర్వహించనున్నారు. సభలో ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ పైచేయి సాధించిన తీరు, అసెంబ్లీ ప్రారంభ సమావేశాల రోజున బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన విధానం, ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీని ఇంకా ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి అనే విషయాలపైనా సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.
సభలో ఏయే అంశాలపై ఎవరు మాట్లాడాలి, సభ్యులు చర్చల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ సీఎం కేసీఆర్ మరణంపై చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన రాజకీయ వివాదం, అనంతరం ప్రభుత్వం, పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న తీరుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో సభలో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సీఎం పార్టీ సభ్యులకు సూచించే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!